శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా పెద్ద శంకరం పేట మండలం మూసాపేట గ్రామానికి చెందిన రామయి సాయిలు (50) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా డిసెంబర్ 24వ తేదీన తనకు ఎలాంటి పని లభించడం లేదని, ఖర్చులకు డబ్బు కావాలని తన స్వగ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో వారు వెంటనే గ్రామానికి వచ్చేయాలని చెప్పారు. అయితే సాయిలు గ్రామానికి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం లక్ష్మీనగర్‌తోపాటు స్వగ్రామంలోనూ కుటుంబ సభ్యులు విచారించారు. అయినప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తెలుపు రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎడమ చేతి వేళ్లకు దెబ్బ తగిలినట్లు ఉంటాయని ఎవరైనా గుర్తు పడితే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.