శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): భార్యతో గొడవపడిన వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటున్న కె.రాములు (31) స్థానికంగా కూలి పనులు చేస్తూ భార్య సంగీతతో కలిసి జీవిస్తున్నాడు. కాగా డిసెంబర్ 14వ తేదీన రాములు తన భార్య సంగీతతో గొడవ పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వాలని ఆమెను వేధించాడు. దీంతో ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీనికి కోపోద్రిక్తుడైన రాములు వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. దీంతో రాములు ఆచూకీ కోసం సంగీత చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద అతని ఆచూకీ కోసం విచారించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాములు ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఉంటాడని, చామనఛాయ రంగులో ఉంటాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు లైట్ గ్రీన్ కలర్ షర్ట్, గ్రీన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎవరైనా గుర్తు పడితే వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని వారు సూచించారు.