శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దరకనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా సెంట్రింగ్ వర్క్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా మాలాద్రికి భార్య తన్నీరు మాధవి (30), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు సెప్టెంబర్ 30వ తేదీన తమ సొంత గ్రామంలో వివాహం నిమిత్తం వెళ్లారు. ఇంట్లో మాలాద్రి ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 8వ తేదీన ఉదయం 8 గంటలకు మాలాద్రి సోదరి అరుణ అతని ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. ఎంత తలుపు కొట్టినా తీయలేదు.
దీంతో మాలాద్రి బహుశా నిద్రపోతూ ఉండవచ్చని ఆమె భావించి వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రం 6 గంటల సమయంలో వచ్చి తలుపు కొట్టింది. అయినా తీయలేదు. దీంతో ఆమె చుట్టు పక్కల వారి సహాయంతో తలుపులు తెరచి చూడగా మాలాద్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని లుంగీకి రక్తం అంటుకుని ఉంది. తీవ్ర గాయాలయ్యాయి. అతని అంగం కట్ చేయబడి ఉంది. దీంతో వెంటనే అరుణ చుట్టు పక్కల వారి సహాయంతో 108 ఆంబులెన్స్‌కు కాల్ చేసి పిలిపించగా వారు వచ్చి పరీక్షించారు. అప్పటికే మాలాద్రి చనిపోయి చాలా సేపు అయిందని వారు నిర్దారించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మాలాద్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి అతని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాలాద్రిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.