అంత్యక్రియల్లో పాడె మోసిన కమిషనర్ సజ్జనార్
నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ పోలీసు అధికారి కుటుంబ సభ్యులు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావడంతో ఎనిమిది మందికి ప్రాణదాతగా మారాడు. అతని గౌరవార్థం సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న ఏ.మహిపాల్ రెడ్డి మార్చి 27వ తేదీన నిజాంపేటలో విధులు నిర్వహిస్తుండగా మద్యం సేవించి వేగంగా కారు నడిపిన ఓ డ్రైవర్ మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిపాల్ రెడ్డికి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు, జీవన్ దాన్ సభ్యులు మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను అవయవ దానం చేసేందుకు ఒప్పించారు. దీంతో బుధవారం కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో మహిపాల్ రెడ్డి 8 అవయవాలను సేకరించిన వైద్యులు అవసరమైన రోగుల చికిత్స కోసం అందజేశారు. మహిపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సైబరాబాద్ కమిషనర్ విసి.సజ్జనార్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాడె మోసి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియల్లో జీవన్ దాన్ ఇంచార్జ్ స్వర్ణలత, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ సురేందర్ రావు లతో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.