- చైన్ స్నాచింగ్, ఇంటి దొంగతనాలపై ప్రజలకు అవగాహన
- చందానగర్ బిఆర్ ఎస్ యూత్ ప్రెసిడెంట్ దొంతి కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం
- ఆర్ సి పురంలో ప్రారంభించిన ఏసిపి కృష్ణ ప్రసాద్, ఎస్సై శశికాంత్ రెడ్డి, క్రైం ఎస్సై తదితరులు
నమస్తే శేరిలింగంపల్లి: నిత్యం జరుగుతున్న చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చందానగర్ బిఆర్ ఎస్ యూత్ ప్రెసిడెంట్ దొంతి కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం ఆర్ సి పురంలో ఏసిపి కృష్ణ ప్రసాద్, ఎస్సై శశికాంత్ రెడ్డి, క్రైం ఎస్సై నర్సింహ, దొంతి సత్యనారాయణ, గుండోజు శ్రీనివాస్ చారి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చైన్ స్నాచింగ్, ఇంటి దొంగతనాల నియంత్రణకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఊర్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బీరువాలో విలువైన వస్తువులు పెట్టకూడదని, లాకర్లలో ఉంచాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి ఇంట్లో ఉన్నారు అన్నట్లుగా ఇంటిని ముస్తాబు చేయాలని చెప్పారు. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్ల ఆగడాలు అధికమవుతున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటరిగా వెళ్తున్న, షాప్ లు నిర్వహిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని గొలుసులు లాక్కెళ్తున్నారని, నగలు కనిపించకుండా చీర కొంగు లేదా చున్నీతో మెడ చుట్టూ కవర్ చేసుకోవాలని సూచించారు. నగదు దోపిడి విషయంలో బ్యాంక్ కు వెళ్లేప్పుడు గానీ, షాపింగు మాల్స్ వెళ్లేప్పుడు తెలిసిన వారిని తోడుగా తీసుకెళ్ళాలని తెలిపారు. రాత్రి, పగటి వేళల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100కు డయల్ చేయాలన్నారు.