- అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళి
నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌలి దొడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కాలేజీ ఐ.ఐ.టి అండ్ మెడికల్ ప్రిపరేషన్ అకాడమీలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్. ఆచార్య శ్రీపతి రాముడు విచ్చేసి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపల్ పాపారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీపతి రాముడు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా, ఆచార్యుడిగా, రచయితగా, 11వ భారత రాష్ట్రపతిగా, విశేషమైన సేవలు అందించారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని పేర్కొన్నారు. అందుకనే భారతీయులందరూ మిస్సైల్ మాన్ గా అభివర్ణించారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు ప్రేరణ పూర్వకమైన ప్రసంగాలు చేసేవారని, ఆయన అజాతశత్రువు, మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి, నిరాడంబరతకి నిలువెత్తు నిదర్శనం అబ్దుల్ కలాం అని అన్నారు. సరళమైన, తేలికైన వ్యక్తిత్వం, యువత మనసులకు దగ్గరయ్యే సామర్థ్యం కారణంగా, యువతరానికి మార్గదర్శకుడుగా, ప్రేరణగా నిలిచారని తెలిపారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని , వారిని సద్వినియోగం చేసుకుంటే సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్నారు. కలాం గొప్ప ఆలోచనలు దేశంలో మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చాయి. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి 2015వ సంవత్సరం నుండి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థి దినోత్సవం గా ప్రకటించినట్లు వెల్లడించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మంచి అలవాట్లను అలవర్చుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని , జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు విద్యాప్రమాణాలతో పాటు మానవీయ లక్షణాలు, నైతిక విలువలు, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, సంబందాలపట్ల ఆసక్తిని రేకెత్తించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు . కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దోర్నాల గణేష్, అధ్యాపకులు రజిత , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉమాచంద్రశేకర్, పద్మజ బెనర్జీ, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు.