హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 21వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గురుడు, శనిగ్రహాలు అత్యంత సమీపంలోకి రానున్నాయి. సోమవారం రాత్రి 11.51 గంటలకు ఖగోళంలో ఈ చారిత్రాత్మక దృశ్యం చోటు చేసుకోనుంది. కాగా ఇలా ఆ రెండు గ్రహాలు సమీపంలోకి రావడం చివరిసారిగా 1623వ సంవత్సరం జూలై 16వ తేదీన జరిగింది. మళ్లీ ఈ అద్భుతం 2080 మార్చి 15వ తేదీన చోటు చేసుకుంటుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్ తెలిపారు. కాగా సోమవారం సూర్యాస్తమయం అనంతరం 6.15 నుంచి 7.30 గంటల మధ్యలో భారత్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని తెలిపారు. పశ్చిమం వైపున ఈ రెండు గ్రహాలను చూడవచ్చని, అవి రెండూ నక్షత్రాల్లా కనిపిస్తాయని తెలిపారు.






