చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తండ్రి వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ లోని ఇంద్రానగర్ కాలనీలో నివాసం ఉండే నరసమ్మ అనే మహిళ 2వ కుమార్తె జె.శోభ (18) ఈ నెల 12వ తేదీన తండ్రి కృష్ణ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కాగా ఈ నెల 18వ తేదీన నరసమ్మ తన భర్త వద్దకు వెళ్లి చూడగా అక్కడికి శోభ రాలేదని వెల్లడైంది. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అంతటా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరొక సంఘటనలో…
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కాలనీకి చెందిన కళ్లేపల్లి వీరాంజనేయులుకు భార్య నీరజ, కుమారుడు కె.కార్తీక్ (11) ఉన్నారు. కాగా కార్తీక్ను తీసుకుని నీరజ 07-10-2020 తేదీన ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాలేదు. ఆ ఇద్దరి ఆచూకీ కోసం వెదికినా ఫలితం లేకపోవడంతో వీరాంజనేయులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






