మియాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్, ఇద్దరు మహిళలకు విముక్తి

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వ్యభిచార రొంపి నుంచి ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో మియాపూర్‌లోని న్యూ హఫీజ్‌పేట్, ఆదిత్యనగర్‌లో ఉన్న ఓ అద్దె ఫ్లాట్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు ఫ్లాట్‌పై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను రక్షించారు.

విచారణలో ప్రధాన నిందితుడు పిల్లలమర్రి సంతోష్ కుమార్ పలు విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 2026 మార్చి నెలలో తొలుత మల్కాజిగిరిలో వ్యభిచార గృహాన్ని ప్రారంభించి, అనంతరం తన కార్యకలాపాలను న్యూ హఫీజ్‌పేట్‌లోని అద్దె ఫ్లాట్‌కు మార్చినట్లు వెల్లడించాడు. ఈ వ్యవహారంలో ఎండీ హసన్ అనే మరో వ్యక్తి సహకరిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలకు ఉద్యోగాలు, వివాహం పేరుతో ఆశ చూపించి ఇక్కడికి తీసుకొచ్చి, అనంతరం వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కస్టమర్లను ఏర్పాటు చేసి ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రక్షించిన ఇద్దరు మహిళల భద్రత నిమిత్తం మహిళా పోలీస్ కానిస్టేబుల్ సంరక్షణలో ఉంచి తదుపరి చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 1657/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 143, 144(2), అలాగే వ్యభిచార నిరోధక చట్టం (PIT Act) సెక్షన్లు 3, 4, 5, 6 కింద కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళల అక్రమ రవాణా, మహిళలపై దోపిడీ, వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి ఏవైనా సమాచారం తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని మియాపూర్ పోలీసులు ప్రజలను కోరారు. బాధిత మహిళల గుర్తింపు, గౌరవం, భద్రతకు పూర్తి రక్షణ కల్పిస్తామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here