శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ సృజన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటిపై సంబంధిత శాఖల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 53 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 34 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ విభాగానికి 11 ఫిర్యాదులు అందాయి. భూసేకరణ విభాగానికి రెండు, పారిశుద్ధ్య విభాగానికి రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఎలక్ట్రికల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ (F&A), చెరువుల విభాగం, రెవెన్యూ (ఆస్తి పన్ను) విభాగాలకు ఒక్కొక్క ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడీ) కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రీవెన్స్ ట్రాకింగ్ లింక్ ద్వారా పౌరులు తమ ఫిర్యాదుల పరిష్కార స్థితి, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా CMC కమిషనర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని, ఫిర్యాదుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడంతో పాటు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు CMC కట్టుబడి ఉందని తెలిపారు.





