శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.3.3 కోట్ల వ్యయంతో 11 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి రాగం నాగేందర్ యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తోందన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల వల్ల విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, తరగతి గదుల్లో రద్దీ తగ్గి ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పీడీ టీచర్ కేశవ రెడ్డి, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.





