ఐక్యరాజ్యసమితి ఆశయాలు, ప్రపంచ శాంతిపై విద్యార్థులకు అవగాహన

శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఐక్యరాజ్యసమితి ఆశయాలు, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సహకారం, మానవ హక్కుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మసీదుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐక్యరాజ్యసమితి దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రజని అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టం, శాంతిభద్రతలు, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు సమిష్టిగా ఏర్పాటుచేసుకున్న అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి అని వివరించారు.

1945 అక్టోబర్ 24న 51 దేశాలతో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం 193 సభ్య దేశాలు ఉన్నాయని, ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉందని తెలిపారు. సభ్య దేశాల మధ్య యుద్ధాలను నివారించడం, అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ బాధ్యతలను గౌరవించేలా చూడడం ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్మాణం, విధులను వివరిస్తూ డాక్టర్ వెంకటరమణ ఆరు ప్రధాన అంగాల గురించి విద్యార్థులకు వివరించారు. సర్వప్రతినిధి సభలో సభ్య దేశాలకు ప్రాతినిధ్యం, సమాన ఓటుహక్కు ఉంటాయని తెలిపారు. భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉంటాయని, వాటిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు కాగా, పది తాత్కాలిక సభ్య దేశాలని వివరించారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలని, వీటికి వీటో అధికారం ఉంటుందని పేర్కొన్నారు.

సచివాలయం ఐక్యరాజ్యసమితి రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తుందని, సెక్రటరీ జనరల్ దాని ప్రధాన అధికారి అని తెలిపారు. ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక–సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం విధులను కూడా వివరించారు. అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉందని, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేర్వేరు సంస్థలని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, కార్మిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక అభివృద్ధి, శరణార్థుల సంక్షేమం వంటి రంగాల్లో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యునెస్కో, యునిసెఫ్, యూఎన్‌డీపీ, యూఎన్‌ఈపీ, ఎఫ్‌ఏఓ, ఐఎల్‌ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), యూఎన్‌ఐడీఓ, యూఎన్‌హెచ్‌సీఆర్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థల సేవలను వివరించారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో ఈ సంస్థలు చేస్తున్న కృషిని విద్యార్థులకు తెలియజేశారు.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి అనేక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటోందని డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణి, ఆయుధ పోటీ, ఉగ్రవాదం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ వలసలు, పేదరికం, నిరుద్యోగం, సాంకేతిక పరిజ్ఞానంలో అసమానతలు, సహజ వనరుల దోపిడీ వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, ప్రపంచ శాంతి, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు డాక్టర్ అంబేద్కర్, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here