అన్నమయ్య సంకీర్తనలకు శ్రీనిధి నృత్యాలయం శిష్య బృందం నృత్యాంజలి

శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అన్నమయ్య సంకీర్తనలకు నృత్యరూపం అందిస్తూ శ్రీనిధి నృత్యాలయం శిష్య బృందం స్వామివారికి నృత్యాంజలి సమర్పించింది. అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో శ‌నివారం అన్నమయ్యపురంలో నిర్వహించిన వారాంతపు అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి పారాయణాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

అనంతరం శ్రీనిధి నృత్యాలయం గురువు కాపూడి వసుధ మార్గదర్శకత్వంలో శిష్య బృందం వివిధ అన్నమయ్య సంకీర్తనలు, భక్తిగీతాలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. విష్ణు శ్రీ, హిమర్షిత, కృతిక, అభిజ్ఞ, సంతాన, సన్విత, సహిత, సహస్ర, హర్షిత, వర్షిక, నిహస్వి, ప్రత్యూష, వర్ష, శరణి, నక్షత్ర, వజ్రనందన, ఆర్. మనస్వి, సాయి సాన్వి, నవనీత, నాగశ్రేష్ఠ, వైష్ణవి, మనస్విని, నిహాన్షి, అద్విక, లిఖిత, ఉషస్విని, నేహశ్రీత, రుచిత, సుధ, రజిని, లక్ష్మీ ప్రసన్న తదితర కళాకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మూషిక వాహన, ముద్దుగారే యశోద, జతిస్వరం, అదివో అల్లదివో, కొలువై ఉన్నాడు, మహా గణపతిం, భావములోన, కొండలలో నెలకొన్న, దశావతార శబ్దం, రామాయణ శబ్దం తదితర గీతాలకు కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. లయ, భావం, అభినయాల సమన్వయంతో సాగిన ప్రదర్శనల ద్వారా స్వామివారికి నృత్య కైంకర్యం సమర్పించారు.

సాయంత్రం 7 గంటలకు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం కొనసాగింది. రాత్రి 7:30 గంటలకు హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. అన్నమయ్య సంకీర్తనలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో డా. శోభారాజు మార్గదర్శకత్వంలో సంకీర్తన యోగా పేరుతో ప్రత్యేక సంగీత శిబిరాన్ని ప్రారంభించనున్నారు. సుమారు ఆరు నెలల పాటు జరిగే ఈ శిబిరంలో పది సంకీర్తనలను నేర్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం అన్నమయ్యపురాన్ని సందర్శించి నిర్వాహకులను సంప్రదించవచ్చని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలను సంగీతం, నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని రానున్న రోజుల్లోనూ పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు, సంగీతాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here