శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు గడువు ముగియడానికి మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పార్టీ శ్రేణులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని సూచించారు. శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మసీద్ బండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రవికుమార్ యాదవ్, వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ బృందాలు అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియలో అవసరమైన సహకారం అందిస్తాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులను గుర్తించాలని సూచించారు. వారి దరఖాస్తులు పూర్తయ్యేలా సహకరించడంతోపాటు ప్రతి డివిజన్, బూత్ స్థాయిలో నాయకులు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందుగానే పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకుని బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అన్నారు. విద్యావంతులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ పోరాడుతోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి ముఖ్య నాయకులతోపాటు వివిధ మోర్చాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





