శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో సగర సంఘం ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ, ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళలందరికీ బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం సంతోషకరమని పేర్కొంటూ, వేడుకలను నిర్వహించిన సగర సంఘం నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని గాంధీ అన్నారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ అని, ఆడపడుచుల అపురూపమైన వేడుక అని పేర్కొన్నారు. ప్రపంచంలో పూలతో దేవుడిని పూజించడం సాధారణమైతే, తెలంగాణలో పూలనే దేవతగా భావించి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ వేడుకలు తెలంగాణ మహిళల ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు నిదర్శనమని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, సగర సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






