ఎల్లమ్మబండ ఈద్గాలో వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఈద్గా వద్ద సమృద్ధిగా వర్షాలు కురవాలని ముస్లింల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకాగా, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజం బాగుండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వరుణ దేవుడిని వేడుకున్నట్లు గాంధీ తెలిపారు. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉందన్నారు. అల్లా దయతో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here