శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా కూకట్పల్లి కోర్టు ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మహిళా న్యాయవాదులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు. తొలుత గౌరీ పూజ నిర్వహించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మకు పూజలు చేసి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. కోర్టు ప్రాంగణం బతుకమ్మ పాటలతో మార్మోగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, అదనపు న్యాయమూర్తి రాంప్రసాద్తో పాటు సీనియర్ సివిల్ న్యాయమూర్తులు, ఇతర న్యాయాధికారులు హాజరై వేడుకలను ప్రారంభించారు. కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ద గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ శివ గౌడ్, కోశాధికారి గోపాల్ రెడ్డి, మహిళా ప్రతినిధి ప్రత్యూష, కల్చరల్ సెక్రటరీ రమేశ్, వేమూరు శ్రీలత పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు సోను మిట్టల్, ధనలక్ష్మి, సందీప్, టి. శ్రీకాంత్, జి. కళ్యాణి, నవీన్, వి. అరవింద్తో పాటు పలువురు మహిళా న్యాయవాదులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.






