శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి శివాజీనగర్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శివాజీనగర్ పార్కు వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నారు. స్థానిక కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, శుక్రవారం సరస్వతీ దేవి అలంకరణలో కొలువుదీరారు. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారి మండపం ఆవరణలో సామూహిక సరస్వతీ పూజలను నిర్వహించారు. భక్తులు పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. శివాజీనగర్లో నవరాత్రి ఉత్సవాలు భక్తి వాతావరణంలో కొనసాగుతున్నాయి.







