శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో గణేశ నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. గణేశ నవరాత్రి వేడుకలు మన సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తూ.. సమాజంలో ఐక్యత, సోదరభావం, స్నేహభావాలను పెంపొందించే వేదికలుగా మారుతున్నాయని అన్నారు.

వినాయక చవితి ఉత్సవాలు హిందూ బంధువులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్వదినమని పేర్కొన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రత్యేకత గణేశ నవరాత్రి వేడుకలకు ఉందన్నారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేశ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. గణేశ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని అన్నారు. యువత గణేశ మండపాల ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో గచ్చిబౌలి డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అభివృద్ధి, శ్రేయస్సుతో ముందుకు సాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





