ఒరిజినల్ పేరుతో నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీల విక్రయం.. రాయదుర్గంలో ఒకరి అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్‌ను ఒరిజినల్ వస్తువులుగా నమ్మించి విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1267/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ సైద్‌నగర్‌కు చెందిన అల్తమాష్ (26) నకిలీ, క్లోన్ చేసిన ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను ఒరిజినల్ ఉత్పత్తులుగా ప్రచారం చేస్తూ ప్రజలకు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా మురాద్‌నగర్‌గా పోలీసులు గుర్తించారు.

నిందితుడి వద్ద నుంచి రెండు ఐఫోన్లు (వీటిలో ఒకటి నకిలీ ఐఫోన్), నాలుగు నకిలీ ఆపిల్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆవేష్ ఖాన్ అనే మరో వ్యక్తి కూడా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన అల్తమాష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును మాదాపూర్ డివిజన్ ఏసీపీ మార్గదర్శకత్వంలో, రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె. రామిరెడ్డి, క్రైమ్ సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి పట్టివేతలో ప్రతిభ కనబరిచిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, క్రైమ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here