అన్నమయ్య సంకీర్తనలతో మంత్రముగ్ధులను చేసిన అనన్య మంత్రవాది

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్య సంకీర్తనలను మధుర స్వరాలతో ఆలపిస్తూ అనన్య మంత్రవాది భక్తులను మంత్రముగ్ధులను చేశారు. అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో శనివారం అన్నమయ్యపురంలో నిర్వహించిన వారాంతపు అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమం భక్తిభావ వాతావరణంలో సాగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించగా, మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి) పారాయణాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థిని అనన్య మంత్రవాది శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి అన్నమాచార్య సంకీర్తనలతో స్వరార్చన సమర్పించారు. ఈ సందర్భంగా హరి అవతారమితడు, అప్పని వరప్రసాది, మాతంగ పర్వత, జయలక్ష్మీ వరలక్ష్మీ, సర్వం విష్ణుమయం, సకల సంగ్రహము, అదిగో అల్లదిహో, మహినుద్యోగి, ఎంత చక్కని దానవమ్మ తదితర అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి భక్తులను అలరించారు. ఈ సంగీత కార్యక్రమానికి కీబోర్డుపై శాస్త్రి, తబలాపై స్వరూప్ వాద్య సహకారం అందించారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఒక అన్నమాచార్య సంకీర్తనకు భావార్థ వివరణ అందించారు. అనన్య మంత్రవాదిని ఆశీర్వదించి, స్వామివారి జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా స్వామివారికి మంగళహారతి నిర్వహించి, భక్తులకు ప్రసాద వితరణ చేయడంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here