శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): జేఎన్‌టీయూ–మియాపూర్–రాయదుర్గం మెట్రో కారిడార్‌లో ట్రాఫిక్ మొబిలిటీ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచే అంశాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎంసీ కమిషనర్, ఆర్టీసీ ఎండీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత ట్రాఫిక్ మొబిలిటీ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ స్టడీపై అధికారులు సమీక్షించారు. మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు, పాదచారులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరుకునేలా సమగ్ర మొబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా చర్చించారు.

ప్రతిపాదిత అధ్యయనంలో సుమారు 8.5 కిలోమీటర్ల కారిడార్‌లో ఫుట్‌పాత్‌ల మిస్సింగ్ లింకులు, పాదచారుల క్రాసింగ్‌లు, ఆక్రమణలు, సురక్షితం కాని ప్రాంతాలను గుర్తించనున్నారు. అవసరమైన చోట ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్‌లను మెరుగుపరిచే అంశాలను పరిశీలించనున్నారు. అలాగే మెట్రో స్టేషన్లు, ప్రధాన జంక్షన్ల వద్ద ఆటో రిక్షా, ఫీడర్ ఆటోలు, ఈ-ఆటోల కోసం ప్రత్యేక పికప్–డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసే అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు, పాదచారుల క్రాసింగ్‌లు, సైన్‌బోర్డులు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ అవసరాలను కూడా అధ్యయనంలో భాగంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా పాఠశాలల వద్ద పీక్ అవర్స్‌లో స్కూల్ బస్సులు, వ్యాన్లు, తల్లిదండ్రుల వాహనాల రాకపోకలతో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించనున్నారు.
ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పాఠశాలలకు సమీపంలో ప్రత్యేక పికప్–డ్రాప్ జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు స్కూల్ చైల్డ్ కార్‌పూలింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించే అవకాశాలను కూడా అధ్యయనం చేయనున్నారు. నడక, సైక్లింగ్, ఫీడర్ ఆటోలు, ఈ-ఆటోలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు, నివాస, వాణిజ్య ప్రాంతాలను మెట్రో స్టేషన్లతో అనుసంధానించే సమగ్ర లాస్ట్‌మైల్ నెట్‌వర్క్ అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణికుడి చివరి గమ్యస్థానం వరకు మొత్తం కారిడార్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి, పాదచారులు, విద్యార్థులు, ప్రజా రవాణా వినియోగదారులకు ఉపయోగపడే ఆచరణాత్మక మొబిలిటీ పరిష్కారాలను గుర్తించనున్నారు. జేఎన్‌టీయూ–మియాపూర్–రాయదుర్గం కారిడార్‌లో సురక్షితమైన పాదచారి మార్గాలు, మెరుగైన మెట్రో అనుసంధానం, ప్రజా రవాణా సమన్వయం, ట్రాఫిక్ నిర్వహణ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడంలో ఈ అధ్యయనం కీలకంగా ఉండనుంది.





