స్కూటీపై నుంచి పడి పంచాయతీ కార్యదర్శి మృతి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొమ్ము పోస్నెట్ దినకర్ (35) సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటల సమయంలో పనిమీద తన స్కూటీపై నల్లగండ్లకు వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఎస్సెన్ ఎలిగెన్స్ సమీపంలో స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో దినకర్ తలకు బలమైన గాయాలు కావడంతోపాటు ఓ దంతం విరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం బీరంగూడలోని మహిమ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని దినకర్‌కు అందుతున్న చికిత్సను పరిశీలించారు. అయితే అదే రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆసుపత్రిలోని డ్యూటీ డాక్టర్ దినకర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి తమకు ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి సోద‌రుడు కొమ్ము శుభాకర్ చార్లెస్ పోలీసులకు తెలిపాడు.

దినకర్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆయన ఉపయోగించిన స్కూటీ నంబర్ TRNO:10826TG5071Aగా పోలీసులు నమోదు చేశారు. ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here