శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో అసెంబ్లీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేత రామచంద్ర రావు నేతృత్వంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి రవికుమార్ యాదవ్ అసెంబ్లీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దాదాపు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, దీంతో సుమారు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఫీజులు చెల్లించలేకపోవడంతో పలు కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదని, కొత్త అడ్మిషన్లను కూడా నిలిపివేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీలు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదువుకునే పరిస్థితి లేకుండా పోతోందన్నారు.
విద్యార్థులకు భరోసా కల్పించలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన. ప్రతిపక్షాల గొంతు నొక్కి, ప్రజా సమస్యలు బయటకు రాకుండా అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారు. అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది అని అన్నారు. సభలు, శాంతియుత ధర్నాలను అడ్డుకుని అరెస్టులతో భయపెట్టాలని చూస్తే తాము వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రాబోయే రోజుల్లోనూ పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, రాష్ట్ర నాయకులు మహేష్, సింధు రెడ్డి, నాయకులు ఓబుల్ రెడ్డి, అనంత రెడ్డి, హర్షిత్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





