శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రజాపాలనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ముందుగా తమ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి వంటి హామీలను ఎంతమేర అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఎంతమందికి ప్రయోజనం కల్పించారో వెల్లడించాలని అన్నారు. దళిత బంధు పథకం ప్రతి దళిత కుటుంబానికి అందిందా? లేక బీఆర్ఎస్ నాయకులు సూచించిన కొందరికే పరిమితమైందా? అని ప్రశ్నించారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో ఎందుకు విడుదల చేయలేదని, నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆటలాడారని విజయభాస్కర్ రెడ్డి విమర్శించారు. ధరణి వ్యవస్థతో లక్షలాది రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పారని ఆరోపించారు. రైతుల కరెంటు గురించి మాట్లాడే ముందు పదేళ్ల పాలనలో రైతులందరికీ రుణమాఫీని ఒకేసారి ఎందుకు పూర్తి చేయలేకపోయారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయి పరిహారం ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ బెదిరింపు భాష మాట్లాడటం బాధ్యతగల నాయకత్వం కాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు ఉందా అని విజయభాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. భారీగా ప్రజాధనం ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సమస్యలు ఎందుకు వచ్చాయని నిలదీశారు. ప్రాజెక్టు అంచనాలు ఎందుకు భారీగా పెరిగాయని, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం ఎందుకు అందలేదని ప్రశ్నించారు.
2014లో మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను పదేళ్లలో భారీ అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. అసంపూర్తి ప్రాజెక్టులు, పెరిగిన అంచనాలు, భారీ అప్పుల భారాన్ని ప్రజలపై మోపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఉండగా, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని గుర్తుచేశారు. రెండు ప్రభుత్వాల పాలనపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి హామీలు నెరవేరలేదని, అయితే భారీ అప్పులు, అసంపూర్తి ప్రాజెక్టులు మాత్రం తెలంగాణ ప్రజలకు మిగిలాయని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారాన్ని కట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముందు.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ పాలనను ఎందుకు కట్ చేశారో ఆలోచించుకోవాలని విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ముందుగా పదేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలకు లెక్క చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ప్రజాపాలనపై మాట్లాడాలని సూచించారు.





