శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు, కూకట్పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి మాధవరం కృష్ణారావు సూచనతో ఉమ్మడి మియాపూర్ డివిజన్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

సాయంత్రం 4 గంటలకు జేపీఎన్ నగర్ కూడలి నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ సాయిరామ్ నగర్ కాలనీ, డీకే ఎన్క్లేవ్ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు అల్లూరి సీతారామరాజు, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే 44వ సర్వే నంబర్‌ను 22ఏ జాబితా నుంచి తొలగించి బాధిత భూ యజమానులకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, కొమిరిశెట్టి సాయిబాబా, బొబ్బ నవతారెడ్డి, పురుషోత్తం యాదవ్, కలిదిండి రోజా, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, శివరాజ్, గోపరాజు శ్రీనివాసరావు, గంగాధర్, శ్రీధర్, జహంగీర్‌తో పాటు ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





