ఇనార్బిట్ మాల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 26 ఏళ్ల యువతి మృతి

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌ సమీపంలో ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందింది. మాదాపూర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన భారతి ముఖి ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్‌ స్టోర్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తోంది. ప్రమాదం జరిగిన రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తన సహోద్యోగి పూజతో కలిసి ఐటీసీ కోహినూర్‌ సమీపానికి భోజనం తీసుకురావడానికి వెళ్లింది. భోజనం తీసుకుని తిరిగి ఇనార్బిట్ మాల్‌ వైపు వస్తుండగా.. మాల్‌ ఎదుట రోడ్డు దాటుతున్న భారతి ముఖిని టీజీ09జీ0666 నంబర్‌ గల కారు ఢీకొట్టింది. కారు అధిక వేగంతో, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భారతి తలకు తీవ్ర రక్తస్రావ గాయం కావడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 1238/2026 నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ప్రమాద సమయంలో కారును నడిపిన వ్యక్తిని హైటెక్‌ సిటీ, మాదాపూర్‌కు చెందిన లింగమనేని సంజుష్‌ (21)గా పోలీసులు గుర్తించారు. అతడు వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజే సంజుష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అదనంగా అతడి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (FSL)కి పంపించారు. మరోవైపు మృతదేహాన్ని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె సోదరుడికి అప్పగించగా, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఒడిశాకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (MVI)తో తనిఖీ చేయించారు. అనంతరం వాహనాన్ని న్యాయస్థానంలో డిపాజిట్‌ చేశారు.

కేసులో అన్ని దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలను నిబంధనల ప్రకారం చేపట్టినట్లు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here