శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రహదారులు, లింక్ రోడ్లు, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులను కోరారు. మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ (CCP) వెంకన్నతోపాటు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేసి ట్రాఫిక్ రహిత రవాణాకు చర్యలు చేపట్టాలని సూచించారు.

మసీదుబండ రోడ్డు విస్తరణ పనులను చేపట్టడంతోపాటు, ఈ ప్రక్రియలో స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి సముచిత న్యాయం చేయాలని గాంధీ కోరారు. జీవనాధారం కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, టీడీఆర్ (TDR) ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. అంజయ్యనగర్ రోడ్డు విస్తరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, టౌన్ ప్లానింగ్, CMC ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని CCP వెంకన్నకు సూచించారు. పనుల్లో వేగం పెంచి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని కోరారు. గంగారం చెరువు నుంచి జాతీయ రహదారి NH-65 మీదుగా అపర్ణ హిల్ పార్క్ వరకు నిర్మించనున్న లింక్ రోడ్డు టెండర్ ప్రక్రియ పూర్తయిందని గాంధీ తెలిపారు. సంబంధిత పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని CCPని కోరారు. ఈ లింక్ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
మాదాపూర్‌లోని గౌసియా కేఫ్ చౌరస్తా నుంచి కొత్తగూడ KIMS ఆసుపత్రి వరకు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని గాంధీ కోరారు. అలాగే జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు అనుసంధానించే లింక్ రోడ్డు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో గాంధీ ప్రతిపాదించిన అంశాలపై CCP వెంకన్న సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ACP హబిబా, TPS సంతోష్, LAO అరుణమ్మ, LAO శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.





