శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు సుభాష్‌నగర్ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ప్రతినిధులతో సమావేశమై వార్డులోని పౌర సమస్యలు, స్థానిక అవసరాలపై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో ప్రధానంగా డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు, పార్కుల అభివృద్ధి, పారిశుధ్యం, నిర్మాణం-కూల్చివేత (C & D) వ్యర్థాల తొలగింపు, అలాగే దోమల నియంత్రణకు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టాలని ప్రజలు కోరారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సర్కిల్ అధికారులు నమోదు చేసుకుని తదుపరి చర్యలకు పంపించారు. సమస్యలను పరిశీలించిన కమిషనర్.. వాటిని ప్రాధాన్యత క్రమంలో తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గుర్తించిన సమస్యల పరిష్కారంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ సకాలంలో తదుపరి చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వార్డు స్థాయిలో ఎదురవుతున్న పౌర సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యతతో పరిష్కార మార్గాలు చూపుతున్నారని తెలిపారు.





