శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 250 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కోరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పౌరసరఫరాల శాఖ అధికారి పుల్లయ్యను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 250 మంది అర్హుల దరఖాస్తు పత్రాలను అందజేశారు.

దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన వారందరికీ ఎలాంటి జాప్యం లేకుండా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యావసర సరుకులు పొందేందుకు ఇది ప్రధాన ఆధారంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, అర్హత ఉన్న ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, శేరిలింగంపల్లి జనరల్ సెక్రటరీ కురుమూర్తి ముదిరాజ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





