శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): మసీదుబండలోని కుడికుంట చెరువు అలుగు నుంచి ప్రభుపాద లేఅవుట్ కాలనీ వరకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ప్రభుపాద లేఅవుట్ కాలనీలో వరద నీటి కాల్వ ఔట్లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కాల్వ ఔట్లెట్ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి కాలనీ ముంపునకు గురవుతోందని స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్య పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని, ప్రతిపాదనలు సిద్ధం చేసి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కుడికుంట చెరువు ఔట్లెట్ నుంచి అధిక మొత్తంలో నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నందున దానిని పరిగణనలోకి తీసుకుని వరద కాల్వ నిర్మాణం చేపట్టాలని గాంధీ సూచించారు. భవిష్యత్‌లో మళ్లీ ముంపు సమస్య తలెత్తకుండా నిర్మాణ పనుల్లో అవసరమైన సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, కాల్వ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని గాంధీ స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా, సౌకర్యవంతమైన ప్రయాణానికి మార్గం సుగమం చేయాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గాంధీ పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి శేరిలింగంపల్లి డివిజన్‌తో పాటు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





