శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ నుంచి గోపన్‌పల్లి వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ జెండా 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి, స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు చేసిన త్యాగాలకు, దేశ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి ఇంటిలో పండుగలా జరుపుకోవాలని కోరారు.

ప్రతి ఇంటిపై తిరంగాను ఎగురవేయడం ద్వారా చిన్నారుల్లో చిన్ననాటి నుంచే దేశం పట్ల భక్తి, గౌరవం, బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధులను స్మరించుకోవడంతో పాటు, సరిహద్దుల్లో ఎండా వానా లెక్కచేయకుండా దేశాన్ని కాపాడుతున్న సైనికులకు గౌరవం తెలిపేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అలాగే దేశంలో అవసరమైన వస్తువులను దేశీయంగానే తయారు చేసుకుని, స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 15 వరకు తమ ఇళ్లపై, వ్యాపార సంస్థలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటిచెప్పాలని గంగాధర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంత్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు శివా సింగ్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, స్వామి గౌడ్, లక్ష్మణ్, నరేందర్ యాదవ్, దయాకర్, కిషన్ గౌలి, తిరుపతి, ప్రకాష్, సూర్య, బబ్లూ సింగ్, రాజు, దినేష్ యాదవ్, రాకేష్, ఆసవరి, అంబన్, ప్రసాద్, శేఖర్, సుమన్, శ్రీశైలం, రవీంద్రతోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





