మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగుడికి కృత్రిమ కాలు.. కొత్త ఆశలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న దివ్యాంగుడు సాయిలుకు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ చొరవతో కృత్రిమ కాలు అందింది. దీంతో సాయిలు రోజువారీ పనులను మరింత సులభంగా చేసుకునే అవకాశం లభించింది. గజ్వేల్‌కు చెందిన సాయిలు ప్రమాదంలో తన ఎడమ కాలును కోల్పోయి చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అత‌ని పరిస్థితిని తెలుసుకున్న మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించి, కూకట్‌పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్ట్‌ను సంప్రదించారు. ట్రస్ట్ సహకారంతో సాయిలుకు కృత్రిమ కాలు అందేలా చర్యలు చేపట్టారు.

శివకృష్ణ చొరవతో కృత్రిమ కాలు అందడంతో సాయిలు జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. రోజువారీ పనులను స్వయంగా నిర్వహించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు వేల్పుగొండ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాంతి వికలాంగుల సంఘం ప్రతినిధి గంటి భ్రమరాంబతోపాటు భారత్ వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, టెక్నిషియన్లు రఘు, మధు, స్వామి, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ.. సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత్ వికాస్ ట్రస్ట్‌కు దివ్యాంగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మెరుగు శివకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here