శేరిలింగంపల్లి ప్రజలకు బోనాల శుభాకాంక్షలు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌లో సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తల‌కు బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అవసరమైన ఏర్పాట్లు చేయడం సంతోషకరమని గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు రూ.30.71 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లను సమన్వయంతో అమలు చేస్తున్నట్లు గాంధీ తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించుకునేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here