శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న రైతాంగ వ్యతిరేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని యంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఒప్పందాలను ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆందోళనలు తప్పవని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆగస్టు 10న ఎస్కేఎం పిలుపులో భాగంగా మియాపూర్ క్రాస్‌రోడ్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు ఎంసిపిఐ(యు) ప్రజా సంఘాల జైల్ భరో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలపై తీవ్ర విమర్శలు చేశారు.

1991లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల కారణంగా ప్రభుత్వ రంగం, ప్రజా అవసరాలకు సంబంధించిన వ్యవస్థలు ప్రైవేటీకరణకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూరుస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలతోపాటు అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రైతాంగానికి మరింత ప్రమాదకరమని చంద్రశేఖర్ అన్నారు. భారత ఎగుమతులపై అమెరికా 10 శాతం సుంకం విధిస్తుందని చెబుతున్నప్పటికీ, అమెరికా నుంచి వచ్చే ఎగుమతులపై భారత్ 18 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.
ఒకవైపు మత విశ్వాసాల పేరుతో ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తూ, మరోవైపు అమెరికాతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ఒప్పందాలు చేసుకోవడం బీజేపీ తన పతనానికి తానే బాటలు వేసుకోవడమేనని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ విధానాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ర్యాలీలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అరుణ్ కుమార్, వనం సుధాకర్, కుంబం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు తాండ్ర కళావతి, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, కమిటీ సభ్యులు డి. రంగస్వామి, జి. శివాని, జి. లలిత, మియాపూర్ డివిజన్ నాయకులు డి. నర్సింహా, బి. అరుణ, ఇషాక్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.





