శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో రూ.1.17 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌రావుతో కలిసి ఆదిత్యనగర్, రామ్‌నరేష్‌నగర్, గౌతమినగర్, హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ కాలనీల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని, చేపట్టే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గౌతమినగర్‌లో ప్రణీత్ బిల్డర్స్ నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కారణంగా ప్రహరీ గోడ కూలిపోవడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని గాంధీ ఆరోపించారు. కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని, ప్రస్తుతం డ్రైనేజీ మరమ్మత్తులు చేపడుతున్నామని తెలిపారు. కాలనీ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నాగార్జున హోమ్స్ రోడ్డు వాస్తవానికి 60 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్నప్పటికీ, వెంకట ప్రణీత్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మాత్రం 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు చూపించి జీ+37 అంతస్తుల భవనానికి అనుమతులు మంజూరు చేయడం అనుమానాలకు తావిస్తోందని గాంధీ ఆరోపించారు. గతంలో ఇదే ప్రాంతంలో 13 ఏప్రిల్ 2020, 2 మే 2023, 2 జనవరి 2024 తేదీల్లో 60 అడుగుల రోడ్డు ఆధారంగానే అనుమతులు ఇచ్చారని, కానీ 26 జూలై 2023న మాత్రమే 100 అడుగుల రోడ్డు పేరుతో అనుమతి ఇవ్వడం వెనుక కారణాలేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే 8 మీటర్ల నాలాను కబ్జా చేయడం, బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టడం వంటి అంశాలపై విచారణ జరిపి, అక్రమంగా మంజూరైన అదనపు అంతస్తుల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే కోర్టు వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదిత్యనగర్ లో రూ.48 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, గౌతమినగర్ – హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ లలో రూ.20 లక్షలతో యూజీడీ నిర్మాణం, రామ్‌నరేష్‌నగర్ లో రూ.49.85 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, మొత్తం రూ.1.17 కోట్లకు పైగా వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.





