శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): డబ్బును రసాయనాల సహాయంతో రెట్టింపు చేస్తామని నమ్మబలికి రూ.20 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాళ్లను మియాపూర్ పోలీసులు, సీసీఎస్ నార్సింగి బృందం సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు విదేశీ పౌరులను అదుపులోకి తీసుకుని రూ.10 లక్షల నగదు, నకిలీ కరెన్సీ, రసాయనాలు, మోసానికి ఉపయోగించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు టూరే ఎల్ హడ్జి మహమానే అలియాస్ ఫోకూ టామెన్ రోమువాల్డ్ అలియాస్ రోలిన్ (49), చౌన్యూ అడోల్ఫ్ అలియాస్ ఔరామ్ (62)గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు ప్రస్తుతం హైదరాబాద్ అత్తాపూర్‌లో, మరొకరు ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.

ఈ నెల 20న శ్రీకృష్ణ కాంత్ వడ్లాని అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విదేశీ నంబర్ల నుంచి పలుమార్లు ఫోన్ చేసిన నిందితులు రసాయనాల సహాయంతో డబ్బును రెట్టింపు చేయగలమని నమ్మించారు. అనంతరం నకిలీ ప్రదర్శన నిర్వహించి నల్ల కాగితాలను రసాయనంలో ముంచి అవి రూ.500 నోట్లుగా మారినట్లు చూపించి బాధితుడి నమ్మకం పొందారు. దీంతో బాధితుడు రూ.20 లక్షలు వారికి అప్పగించాడు. డబ్బును పెట్టెలో ఉంచినట్లు చూపించి ప్రత్యేక రసాయనం తీసుకొచ్చిన తర్వాతే పెట్టె తెరవాలని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం పెట్టె తెరిచి చూడగా నగదు స్థానంలో తెల్ల కాగితాలు, రంగు ఫొటోకాపీలు మాత్రమే ఉండటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన వెంటనే మియాపూర్ పోలీసులు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించారు. ఏరియా పెట్రోలింగ్ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో నిందితుల నుంచి పలు వస్లువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.10 లక్షల నగదు, రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ అమెరికన్ డాలర్ నోట్లు, యాక్టివేషన్ పొడి, రసాయన ద్రావణ సీసాలు, నల్ల కాగితాల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు టూరే ఎల్ హడ్జి మహమానేపై 2025లో పాస్‌పోర్ట్, విదేశీయుల చట్టాల కింద కేసుతో పాటు 2022లో గుజరాత్లో కూడా మోసం కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. రసాయనాలు, బ్లాక్ మ్యాజిక్ లేదా ఇతర పద్ధతులతో డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. త్వరగా లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు నగదు ఇవ్వవద్దని హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఇలాంటి ఆఫర్లను నమ్మకుండా అనుమానాస్పద సమాచారం అనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా 100, 112 నంబర్లలో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.





