హఫీజ్‌పేట్ రైల్వే అండర్‌పాస్‌కు రూ.70 లక్షలతో శాశ్వత పరిష్కారం

శేరిలింగంప‌ల్లి, జూలై 26 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీలో ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ‌, సీసీ రోడ్డు నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మంజీరా పైప్‌లైన్ రోడ్ నుంచి మసీదుబండకు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రూ.70 లక్షలతో వరద నీటి కాల్వ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నీటి కాల్వ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రాధాన్యత ఉంటుందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని అధికారులకు సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. హఫీజ్‌పేట్ డివిజన్‌తో పాటు మొత్తం శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, నాయకులు వెంకటేశ్వర్లు, క్రిషాంక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here