శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన ఘటనను నిరసిస్తూ, ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) సమస్యలపై విద్యార్థులకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం క్యాండిల్ ర్యాలీ, సత్యాగ్రహం నిర్వహించారు. పీజేఆర్ స్టేడియంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి చందానగర్ మెయిన్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, ఒబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించే సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల స్వరం దేశ భవిష్యత్తు స్వరం. ఆ స్వరాన్ని అణచివేయడం కాదు, ఆలకించడం ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై తొలి రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున పోరాడుతోందని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, లేబర్ సెల్, మైనారిటీ విభాగం ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.





