శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా టీపీసీసీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టు ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని విమర్శించారు. రాజ్యాంగ విలువలను కాలరాసే చర్యగా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి నేతృత్వంలో ధర్నా, ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఆందోళన అనంతరం పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని చందానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ నాయకులు మౌన దీక్ష చేపట్టి తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ దేశ యువత భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు పెరుగుతోందని, ఆ మద్దతును చూసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, కావూరి ప్రసాద్, యాద గౌడ్, హరి కిషన్, నగేష్ నాయక్, రవీందర్ రెడ్డి, శ్రీహరి గౌడ్, సౌందర్య రాజన్, మండగడ్డ నర్సింగ్ రావు, నితిన్ గౌడ్, ముషారఫ్, మహిళా కాంగ్రెస్ నాయకులు జయ, శాంత తదితరులు పాల్గొన్నారు.





