వైశాలి నగర్ UGD సమస్యకు శాశ్వత పరిష్కారం: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూలై 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్, సరోవర్ ఎనక్లేవ్ కాలనీల్లో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) ఔట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నట్లు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీల్లో వర్షాకాలంలో ఎదురవుతున్న ముంపు సమస్యను దృష్టిలో ఉంచుకుని వరద నీటి కాల్వ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని చెప్పారు. వరద నీటి ఔట్‌లెట్ సక్రమంగా లేకపోవడంతో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరద నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి కాల్వ నిర్మాణం చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు.

అదేవిధంగా ఈర్ల చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెరువులో కలుషిత నీరు చేరకుండా చుట్టూ ప్రత్యేక డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. హఫీజ్‌పేట్ డివిజన్‌తో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలకు మెరుగైన రవాణా, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని గాంధీ వెల్లడించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్‌తోపాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here