శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, స్థానిక ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు సంబంధిత విభాగాల అధికారులు కలిసి కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మాదాపూర్ సర్కిల్‌లో ఉన్న మాదాపూర్ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని పౌర సమస్యలు, మౌలిక వసతుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాదాపూర్‌లోని సిలికాన్ వ్యాలీ పార్క్‌లో నిర్వహించిన సమావేశంలో కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, స్థానిక ప్రజలతో కమిషనర్ నేరుగా మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పౌర సదుపాయాలు, మౌలిక వసతులకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

స్థానికులు బోర్‌వెల్ మరమ్మత్తులు, యూజీడీ నెట్‌వర్క్ అప్‌గ్రేడేషన్, తాగునీటి సరఫరా, తక్కువ నీటి ఒత్తిడి, ట్యాంకర్ సేవల సమస్యలు, రహదారుల మరమ్మత్తులు, అభివృద్ధి పనుల వల్ల పేరుకుపోయిన వ్యర్థాలు, శిథిలాల తొలగింపు, ఆక్రమణల నిర్మూలన, అక్రమ పార్కింగ్‌పై చర్యలు, ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల ఆట పరికరాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు, పార్కుల పరిసరాల్లో పెట్రోలింగ్ పెంచాలని, చెట్ల కొమ్మల కత్తిరింపు తర్వాత ఏర్పడే గ్రీన్ వేస్ట్‌ను సకాలంలో తొలగించాలని, సీఎన్ తండా శ్మశానవాటిక సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. చెత్త వేయడం, వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు హాస్టళ్లలో నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణపై కూడా చర్చ జరిగింది.
ప్రజలు ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిశీలించిన కమిషనర్, అత్యవసర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా వార్డు స్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం లభిస్తోందన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.





