శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటరు జాబితా ప్రత్యేక సారాంశ సవరణ (SIR) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో SIR పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి (ERO) నారాయణ్ అమిత్ తో పాటు అన్ని డివిజన్ల సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROలు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా CEO తెలంగాణ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో కొత్త నమోదులు, తొలగింపులు, సవరణలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, SIR ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం జోనల్ కమిషనర్, ERO నారాయణ్ అమిత్ శేరిలింగంపల్లి జోన్ పరిధిలో SIR పనుల పురోగతిని వివరించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ, బూత్ లెవల్ అధికారుల (BLOలు) క్షేత్రస్థాయి తనిఖీలు, ఓటర్ల అవగాహన కార్యక్రమాలపై చేపడుతున్న చర్యలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సూపర్వైజర్లు, AEROలకు CEO తెలంగాణ పలు కీలక సూచనలు చేశారు. గడువులోపు డేటా అప్డేట్ పూర్తి చేయడం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి జోన్కు చెందిన అన్ని డివిజన్ల సూపర్వైజర్లు, AEROలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





