శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ల పరిధిలో రూ.24 కోట్ల 56 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఇందులో సీసీ రోడ్లు, వరద నీటి కాల్వలు, శ్మశాన వాటిక అభివృద్ధి పనులతోపాటు పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, గోపినగర్, బాపునగర్, డోయన్స్ కాలనీ, హాల్ కాలనీ, శిల్ప గార్డెన్స్, శిల్ప వ్యాలీ, సెంట్రల్ పార్క్ ఫేజ్-2, క్యాంలెట్ కాలనీ, ప్రభుపాద లేఔట్, కేఎంఆర్ ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో రూ.19.18 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో యాదవ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి జాప్యం లేకుండా పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేలా, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రతి కాలనీ, పార్కులో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వాటి ద్వారా యువతతోపాటు వృద్ధులు, మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్య శేరిలింగంపల్లి లక్ష్యంగా ఈ కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





