శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పౌరులు తమ సమస్యలు, వినతులు, సూచనలను నేరుగా కమిషనర్ సృజన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శాఖాధిపతుల సమక్షంలో ప్రతి వినతిని కమిషనర్ సమీక్షించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 52 ఫిర్యాదులు అందగా, వాటిలో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించినవి 42, ఇంజినీరింగ్ శాఖకు 9, ఎంటమాలజీ (దోమల నియంత్రణ) శాఖకు 1 ఫిర్యాదు వచ్చాయి.

ప్రతి ఫిర్యాదును ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ (Grievance ID), ట్రాకింగ్ లింక్ తో నమోదు చేయడం ద్వారా ఫిర్యాదు పురోగతిని పౌరులు పారదర్శకంగా తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖలు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించి, సకాలంలో పరిష్కారం అందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.





