విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి.. ఆర్. కృష్ణయ్య, బేరి రామచంద్ర యాదవ్ డిమాండ్..

శేరిలింగంప‌ల్లి, జూలై 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తార్నాకలోని విద్యానగర్ బీసీ భవన్‌లో నిర్వహించిన జేఏసీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం కార్పొరేట్, మెడికల్, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో విద్యా ఖర్చులు భారీగా పెరిగాయని, దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయడంతోపాటు ప్రతి ఏడాది బడ్జెట్‌లో విద్యకు అధిక నిధులు కేటాయించాలని కోరారు.

అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం, హాస్టల్ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని సూచించారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో కలిసి బీసీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ వర్గాల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం పెరుగుతోందని విమర్శించిన నాయకులు, పోలీసు, రెవెన్యూ శాఖల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీల జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బడ్జెట్‌లో 50 శాతం నిధులు కేటాయించి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి శ్రీపురం హరికృష్ణ చారి, బీసీ జేఏసీ ఉపాధ్యక్షుడు నాయి బ్రాహ్మణ శ్రీశైలం, యాదవ్ విద్యార్థి విభాగం కార్యదర్శి గౌరెల్లి అరుణ్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here