శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే బలమైన పునాది అని, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడ డివిజన్ హుడా కాలనీలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు)తో మాట్లాడిన జగదీశ్వర్ గౌడ్, ఓటరు నమోదు ఫారాలను పూర్తిగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితమైన వివరాలతో నింపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. స్వచ్ఛమైన, కచ్చితమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న జగదీశ్వర్ గౌడ్, ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరుకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.





