శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నార్సింగి సర్కిల్ లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్కాపూర్ పార్క్-2, సర్దార్ పటేల్ పార్క్, గోల్డెన్ మైల్ రోడ్ జంక్షన్, నేక్నంపూర్ చిన్న చెరువు సరస్సు పునరుజ్జీవన ప్రతిపాదన, వ్యూ (VUE) జంక్షన్ ప్రాంతాలను సందర్శించి చేపడుతున్న పనులను పరిశీలించారు.

అనంతరం అధికారులతో జరిగిన సమీక్షలో అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అత్యున్నత ప్రమాణాలతో పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన పౌర సేవలు అందించడంలో ఈ అభివృద్ధి పనులు కీలకమని పేర్కొన్న నారాయణ్ అమిత్, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.





