బీసీల ఆత్మగౌరవ భవనాల భూములను వెంటనే కుల సంఘాలకు అప్పగించాలి

శేరిలింగంప‌ల్లి, జూన్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన భూములను వెంటనే సంబంధిత బీసీ కుల సంఘాలకు అప్పగించాలని బీసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోకాపేట్, ఉప్పల్ భగాయత్ ప్రాంతాల్లో 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రక్షించి, ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్ వద్ద డాక్టర్ వై. శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిర్మించాల్సిన భవనాల ఏర్పాటు ఇప్పటికీ అమలు కాకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, బీసీ కులాలకు కేటాయించిన భూములను వెంటనే ఆయా కుల సంఘాలకు అధికారికంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీసీలకు కేటాయించిన స్థలాల్లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని సూచించారు. ఈ భవనాల్లో బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం గ్రంథాలయాలు, హాస్టళ్లు, పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బీసీల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి ఈ భవనాలు కేంద్రాలుగా మారేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు సాయన్న ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొంటు ముకుందం, యువజన అధ్యక్షుడు కొంటు సుమన్, ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి, యాదవ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగుల మధు యాదవ్‌, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here