శేరిలింగంపల్లి, జూన్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ ప్రతి కుటుంబం బాధ్యత అని పేర్కొంటూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో వ్యాధి చిన్నారుల్లో శాశ్వత అంగవైకల్యానికి దారితీసే ప్రమాదకర వైరస్ వ్యాధి అని పేర్కొన్న హమీద్ పటేల్, సమయానికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని చెప్పారు.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఉచితంగా పోలియో చుక్కలు అందిస్తున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎన్.రూపారెడ్డి, జే. బలరాం యాదవ్, డా. రమేష్ గౌడ్, తిరుపతి యాదవ్, తోట వెంకటరమణ, మోదుగు ప్రసాద్ రావు, పుణ్యవతి, గిరి గౌడ్, కేశం కుమార్ ముదిరాజ్, సత్తిబాబు, నీలం లక్ష్మి నారాయణ ముదిరాజ్, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, సయ్యద్ ఖాసీం, నాగరాజు, నరేష్, విజయ్, జహంగీర్, రఫియా బేగం, ప్రభాకర్, రాజశేఖర్ పాల్గొన్నారు.





